ల్యాప్‌టాప్ ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు చాప కింద నీరులా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తల నొప్పి నుండి వెన్ను నొప్పి వరకు, కంటి సమస్యల నుండి గుండె జబ్బుల వరకు అనేక రోగాలను తెచ్చిపెడుతుంది. గంటల తరబడి స్క్రీన్ వైపు తేరిపారే చూడటం వల్ల కళ్ళు బాగా అలసిపోతాయి. కళ్ళు పొడిబారిపోవడం, మంటలు, దురద వంటి సమస్యలు మొదలవుతాయి. ఇక బ్లూ లైట్ ప్రభావం వల్ల నిద్రలేమి సమస్య కూడా తలెత్తుతుంది. అలాగే చూపు మసకబారడం, కంటి ఒత్తిడి వంటివి దరిచేరతాయి. సరైన భంగిమలో కూర్చోకుండా ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని లేదా వంగి పని చేయడం వల్ల వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇక దీనివల్ల మెడ నొప్పి, భుజాల నొప్పి, నడుము నొప్పి వేధిస్తాయి. కాలక్రమేణా ఇది స్పాండిలైటిస్, డిస్క్ సమస్యలకు దారితీయవచ్చు. ల్యాప్‌టాప్ ముందు కదలకుండా ఒకే చోట కూర్చోవడం ఊబకాయానికి (బరువు పెరగడం) ప్రధాన కారణం అవుతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇది టైప్ 2 మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో ఈ సమస్యలను అరికట్టవచ్చు. ల్యాప్‌టాప్‌ను తల ఎత్తుకు సమానంగా ఉండేలా చూసుకోండి. కంఫర్ట్‌గా ఉండే కుర్చీని ఉపయోగించండి, వెన్ను నిటారుగా ఉంచండి. ప్రతి అరగంటకు ఒకసారి లేచి, ఒక ఐదు నిమిషాలు నడవండి లేదా చిన్నపాటి ఎక్సర్ సైజులు చేయండి. ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. బ్లూ లైట్ ఫిల్టర్లను ఉపయోగించండి లేదా యాంటీ-గ్లేర్ స్క్రీన్‌ను అమర్చుకోండి. ఇక వీలైనంత వరకు పని ఒత్తిడిని తగ్గించుకుని, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వండి. సాంకేతికత ఎంత ఉపయోగకరమైనా, దాన్ని అతిగా వాడటం వల్ల మన ఆరోగ్యమే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, పని ముఖ్యం అనుకుంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇక చిన్నపాటి అలవాట్లను మార్చుకోవడం ద్వారా ల్యాప్‌టాప్ తెచ్చే రోగాల నుండి మనం సులభంగా బయటపడవచ్చు.
0 Comments