ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక రాష్ట్రం నుంచి మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం కొంతమంది భక్తులు బొలెరో వాహనంలో బయలుదేరారు. చిలకలడోణ గ్రామం సమీపానికి చేరుకోగానే, ఎదురుగా వస్తున్న లారీ – బొలేరో వాహనం అత్యంత వేగంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాద దాటికి బొలేరో వాహనం నుజ్జునుజ్జయ్యింది. ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు కన్నుమూశారు. మృతులంతా కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు పోలీసులు స్పందించి క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అధికారులు, బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అతివేగం మరియు అజాగ్రత్తే ఈ ఘోర ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మంత్రాలయం వెళ్లే రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం, పైగా మలుపుల వద్ద అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఇలా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం భక్తులను మరియు స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
0 Comments