వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లక్ష్యంగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సపంలో దుండగులు రాళ్లతో దాడికి తెగబడ్డారు. గస్తీలో ఉన్న పోలీసులు అప్రమత్తమవ్వడంతో దుండుగులు పారిపోయారు. ఈ క్రమంలో వారిని పట్టుకునేందుకు సినీ ఫక్కీలో పోలీసులు చేజింగ్ చేశారు. కానీ 30 మంది గ్యాంగ్ తప్పించుకుని వెళ్లింది. అయితే గ్యాంగ్‌లోని ఇద్దరు మహిళలు మాత్రం పట్టుబడ్డారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి బయల్దేరిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ గతరాత్రి తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ దాటుతున్న సమయంలో ట్రాక్ పక్కన 30 మంది గ్యాంగ్ మాటు వేసి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించింది. కిటికీలు, బోగీలకు రాళ్లు తగలడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సరిగ్గా అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఆ గుంపును గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా సుమారు 30 మంది గుంపు పోలీసులను రౌండప్ చేసి దాడికి యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాల సాయం కోరారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో వారిని కిలోమీటర్ల మేర ఛేజ్ చేశారు. కానీ నందిగామ మండలంలోని పాత జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎన్‌సీఎల్ వెంచర్ గుండా పరుగులు తీసి చీకట్లో తప్పించుకున్నారు. ఇద్దరు మహిళలు మాత్రం పోలీసులకు చిక్కారు. వారిని బీహార్, ఒడిశా, రాజస్థాన్‌కు చెందిన ముఠాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టయిన ఆ ఇద్దరు మహిళలను విచారించగా, తాము రుద్రాక్ష మాలలు అమ్ముకోవడానికి వచ్చామని చెబుతున్నారు. అయితే, అర్ధరాత్రి వేళ రైలుపై దాడికి గల కారణాలపై వారు సరైన వివరణ ఇవ్వడం లేదని, వారి వేషధారణ, ప్రవర్తనపై పోలీసులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరంతా పక్కా ప్రణాళికతోనే రైళ్లను లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. పరారైన ఆ 30 మంది గుంపు కోసం పోలీసులు రాత్రంతా వెంచర్లలో గాలింపు చర్యలు చేపట్టారు. రాజస్థానీ వేషధారణలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నందిగామ, తిమ్మాపూర్ పరిసర గ్రామాల్లోని ప్రజలు అపరిచితులకు ఆశ్రయం ఇవ్వకూడదన్నారు రైల్వే ట్రాక్‌ల సపంలో అనుమానిత కదలికలు ఉంటే డయల్ 100 కి కాల్ చేయాలని కోరారు.
0 Comments