Ad Code

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం


హైదరాబాద్‌, నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేకే కాలనీలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. జేకే కాలనీలోని ఓ ఇంట్లో గతంలో ఒక వ్యక్తి అద్దెకు ఉండేవారు. అయితే, గత మూడు నెలలుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అద్దెదారు కనిపించకపోవడం, కనీసం ఇంటి యజమానికి అద్దె కూడా చెల్లించకపోవడంతో యజమానికి అనుమానం వచ్చింది. ఇంటి యజమాని వచ్చి తాళం పగలగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా, ఇల్లు మొత్తం దుర్వాసనతో నిండిపోయింది. లోపలికి వెళ్లి వెతకగా, వంటగదిలోని కిచెన్‌లో బండకింద గుర్తు తెలియని వ్యక్తి శవం కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే నేరేడ్‌మెట్ పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో, అది పురుషుడిదా లేక మహిళదా అనేది కూడా ప్రాథమికంగా గుర్తించలేనంత దారుణంగా ఉంది. శవం కిచెన్ బండ కింద ఉంచడాన్ని చూస్తే, ఇది ఓ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా చంపి అక్కడ దాచిపెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆ ఇంట్లో నివసించిన వ్యక్తి ఎవరు..?, అతను ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా వివరాలు సేకరించే అవకాశం ఉంది. కాలనీలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గత మూడు నెలల్లో ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జనసంచారం ఉండే కాలనీలో, అది కూడా మూడు నెలల పాటు ఇంట్లో శవం ఉండటం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ మిస్టరీ మరణం వెనుక ఉన్న అసలు నిజాలు పోస్ట్‌మార్టం నివేదిక, పోలీసుల సమగ్ర విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu