ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో జాతీయ రహదారిపై బీరు కంటైనర్ – మిరపకాయల ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో జాతీయ రహదారిపై గందరగోళంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని గురించి కాకుండా లారీల్లోని సరుకుకు కాపాలా కాయలేక పోలీసులు నానా హైరానా పడ్డారు. ఝాన్సీ – కాన్పూర్ జాతీయ రహదారిపై, మోంతా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మీరట్ నుండి వేలకొద్దీ బీరు బాటిళ్లతో వస్తున్న ఒక భారీ కంటైనర్, ఎదురుగా మిరపకాయల లోడుతో వస్తున్న ట్రక్కును అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ట్రక్కులోని మిరపకాయల బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా ఘాటైన వాసనతో నిండిపోయింది. బీరు కంటైనర్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక్క బాటిల్ కూడా బయటకు పోకుండా చూడటానికి కంటైనర్ చుట్టూ ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. భారీ క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించి, రహదారిపై గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు.
0 Comments