తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న శ్రావణి అనే విద్యార్థి బుధవారం తెల్లవారుజామున వసతి గృహం వరండాలో పడి మృతి చెంది ఉంది. శ్రావణి తెల్లవారుజామున వాష్ రూమ్ కోసం వెళ్లి వస్తుండగా, పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. వరండాలో విద్యార్థిని పడిపోవడాన్ని గమనించిన వసతి గృహం సిబ్బంది, హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శ్రావణిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆర్డీవో ప్రభాకర్ తహసీల్దార్ ప్రేమ్, సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేష్ ఆసుపత్రి నుండి అనంతరం విచారణ నిమిత్తం వసతి గృహానికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్నకు చెందిన శ్రావణి తండ్రి లేకపోవడంతో వసతి గృహంలో ఉండి నాలుగేళ్లుగా చదువుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. శ్రావణి తల్లి, అన్న, అక్క హైదరాబాద్‌లో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రావణి మృతి చెందడంతో హాస్టల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై అధికారులు వైద్యులతో, విద్యార్థులతో చర్చించారు. అయితే వసతి గృహంలో నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపిస్తూ హాజీపూర్ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. వారంతా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలి వెళ్లి విద్యార్థిని మృతిపై అనుమానం ఉందని విద్యార్థిని తల్లి లక్ష్మి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
0 Comments