వందే భారత్ తరహాలో, అత్యాధునిక హంగులతో రూపొందించిన మొట్టమొదటి నాన్-ఏసీ లోకల్ రైలు ముంబై చేరుకుంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ, ఆటోమేటిక్ డోర్ వ్యవస్థతో రూపొందించిన ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం చేసింది. ముంబై లోకల్ రైళ్లంటేనే తెరచి ఉండే తలుపులు, ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు గుర్తొస్తాయి. ఈ లోకల్ రైళ్లను ముంబై జీవనరేఖగా పేర్కొంటారు. నిత్యం అత్యంత రద్దీగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. అయితే, ఇలాంటి ప్రయాణాల కారణంగా ఏటా వందలాది మంది ప్రయాణికులు రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 2025లో ముంబ్రా సమీపంలో జరిగిన ఒక విషాద ఘటన తర్వాత, రైల్వే శాఖ ఈ ఆటోమేటిక్ డోర్ క్లోజ్ వ్యవస్థపై సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో వందేభారత్ రైలు తరహాలో అన్ని తలుపులు మూసుకుంటే తప్ప ఇంజిన్ స్టార్ట్ కాదు. తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణించే ప్రమాదకర సంస్కృతికి దీనితో అడ్డుకట్ట పడనుంది. నాన్-ఏసీ రైలులో తలుపులు మూసివేస్తే ఉక్కపోత పెరుగుతుందనే ఆందోళనపై రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం మూడు రకాల సాంకేతిక మార్పులు చేశారు. హై-కెపాసిటీ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. సాధారణ రైళ్ల కంటే రెట్టింపు సామర్థ్యంతో గంటకు 10,000 క్యూబిక్ మీటర్ల తాజా గాలిని ఇవి లోపలికి పంపిస్తాయి. అలాగే కిటికీల వెడల్పును 900 మిమీ నుంచి 1,900 మిమీకి పెంచారు. దీనివల్ల ప్రయాణికులకు మంచి వ్యూతో పాటు వెలుతురు లభిస్తుంది. ఇక తలుపులకు ప్రత్యేకమైన గాలి రంధ్రాల (లౌవర్స్) అమరిక ఉంటుంది. తద్వారా తలుపులు మూసి ఉన్నా గాలి ప్రసరణ నిరంతరం జరుగుతుంది. కేవలం భద్రతే కాకుండా, ప్రయాణ అనుభవాన్ని మార్చేలా మరిన్ని హంగులను ఈ రైలులో జోడించారు. ఒక కోచ్ నుంచి మరో కోచ్‌లోకి లోపలి నుంచే వెళ్లేలా వెస్టిబ్యూల్ సౌకర్యం ఉంది. దీనివల్ల రద్దీ ఒకే చోట ఉండకుండా సమానంగా పంపిణీ అవుతుంది. ప్రయాణికుల కోసం లెగ్‌రూమ్ పెంచి, సీట్లను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. తదుపరి స్టేషన్ వివరాలు, భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు తెలిపే డిజిటల్ డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు. 12 కోచ్‌ల ఆటోమేటిక్ డోర్ క్లోజ్‌నాన్ ఏసీ రైలు ప్రస్తుతం కుర్లా కార్ షెడ్‌కు చేరుకుంది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ దీనిపై కఠినమైన భద్రతా పరీక్షలు నిర్వహించనుంది.
0 Comments