జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ లో హిందూ శోభాయాత్ర తమ డీజే సంగీతాన్ని స్వచ్ఛందంగా నిలిపివేసి, ముస్లిం అంతిమ యాత్ర గౌరవంగా సాగిపోయేలా దారిని వదిలిపెట్టారు. మత సామరస్యానికి చిహ్నంగా నిలిచిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మొదటగా 'digital creator @ak_vlogg_' మార్చి 29, 2026న షేర్ చేయగా, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికలపై మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందిందిమత సామరస్యంకు ఇది నిలువెత్తు సాక్ష్యమని దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హజారీబాగ్‌లో భారీ జనసందోహం, కాషాయ జెండాలు మరియు హై-ఎనర్జీ డీజే సంగీతంతో రామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో ఒక ముస్లిం అంతిమ యాత్ర ప్రధాన రహదారికి చేరుకుంది. అది గమనించిన వెంటనే భక్తులు డీజే ఆపరేటర్లకు సిగ్నల్ ఇచ్చి సంగీతాన్ని నిలిపివేయించారు. అంతిమ యాత్ర సాగిపోయే వరకు భక్తులందరూ నిశ్శబ్దంగా వరుసల్లో నిలబడి దారి ఇచ్చారు. చాలామంది భక్తులు తల వంచి నిశ్శబ్దంగా నివాళులర్పించడం అక్కడి పరస్పర గౌరవానికి అద్దం పట్టింది. ఈ ఏడాది డీజేలపై పరిపాలనాపరమైన కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ, ఈ ఘటనలో భక్తులు ప్రదర్శించిన చొరవ పూర్తిగా స్వచ్ఛందమైనది. "ఇదే అసలైన హజారీబాగ్.. మేము వేడుకలను కలిసి జరుపుకుంటాము, ఒకరి దుఃఖాన్ని మరొకరం గౌరవించుకుంటాము" అని స్థానికులు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు లభిస్తున్న ఆదరణ చూసి, నెటిజన్లు దీనిని 'హజారీబాగ్ మోడల్' అని పిలుస్తున్నారు. ఆచారాల కంటే మానవత్వమే మిన్న అని నిరూపించిన ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందుతోంది.
0 Comments