బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని నెలమంగళ సమీపంలోని వాజరహళ్లికి చెందిన దిలీప్ (28) వృత్తిరీత్యా జిమ్ ట్రైనర్. ఫిట్‌నెస్ మీద ఉన్న మక్కువతో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో పలు పతకాలు కూడా సాధించాడు. ఒక వివాహితతో ఏర్పడిన పరిచయం కాస్తా వేధింపులకు దారితీయడంతో, మనస్తాపానికి గురైన బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరు శివారు ప్రాంతంలోని జిమ్‌లో దిలీప్ కోచ్‌గా పనిచేస్తున్న క్రమంలో, అక్కడికి వస్తున్న ఒక వివాహిత (42)తో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు పిల్లలున్న ఆ మహిళకు దిలీప్ వ్యక్తిగత శిక్షకుడిగా సేవలందించేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం పెరిగి, అది వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరి వ్యవహారం సదరు గృహిణి ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. గతేడాది ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాజీ పంచాయితీ కూడా జరిగింది. అప్పటి నుంచి దిలీప్ ఆమెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ, సదరు మహిళ మాత్రం అతడిని వదలలేదు. దిలీప్ ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని లేదా సహజీవనం చేయాలని ఒత్తిడి తెచ్చింది. అంతేకాకుండా, దిలీప్ పేరిట ఉన్న ఇంటిని తన కుమారుడి పేరు మీద రాయాలని తీవ్రంగా బెదిరించినట్లు తెలుస్తోంది. నా కుమారుడు ఒక మంచి క్రీడాకారుడు. ఆ మహిళ కావాలని వల వేసి నా కొడుకును వేధించింది. తన కోరికలు తీర్చాలని, ఆస్తులు రాసివ్వాలని బెదిరించింది. ఆ వేధింపులు భరించలేకే దిలీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దిలీప్ తండ్రి రమేష్ కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు దిలీప్ సదరు మహిళకు ఫోన్ చేసి, తాను చనిపోతున్నట్లు చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు నెలమంగళ పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ రికార్డింగ్‌లు, చాటింగ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
0 Comments