హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌కు చెందిన ఎండీ షరీఫ్ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాల కోసం డబ్బు అవసరం కావడంతో తన ఇంట్లోనే దొంగతనానికి స్కెచ్ వేశాడు. తల్లి, చెల్లికి సంబంధించిన బంగారాన్ని దొంగిలించి స్నేహితులతో కలిసి జల్సాలు చేసిన పోలీసులకు దొరికిపోయాడు. మార్చి 29న తన స్నేహితులతో కలిసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి, చెల్లికి సంబంధించిన 20 తులాల బంగారాన్ని చోరీ చేశాడు. బంగారం కనిపించకపోవడంతో కంగారుపడిన బాధితులు మార్చి 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కంచన్‌బాగ్ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా, దొంగ బయటి వ్యక్తి కాదని, ఇంట్లోనే ఉన్న షరీఫ్ అని తేలింది. నిందితుడు కేవలం ఒక్కసారి కాకుండా, ఏకంగా నాలుగు సార్లు దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు. దొంగిలించిన 20 తులాల బంగారంలో 7 తులాలను అప్పటికే అమ్మేసిన షరీఫ్, ఆ డబ్బుతో స్నేహితులతో కలిసి విలాసవంతమైన జీవితం గడిపాడు. మిగిలిన 13 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో షరీఫ్‌కు సహకరించిన అతని స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
0 Comments