యుద్ధ ప్రభావం ఇంజనీరింగ్ ఎగుమతులపై పడినట్లు ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ)గణాంకాలు తెలియజేస్తున్నాయి. యూఏఈకి మార్చి నెలలో ఎగుమతులు 237 మిలియన్ డాలర్లకు తగ్గాయి. 2025 మార్చిలో ఎగుమతులు 715 మిలియన్ డాలర్లతో పోల్చితే 66.8 శాతం పడిపోయాయి. సౌదీ అరేబియాకు సైతం మార్చి నెలలో ఎగుమతులు 248 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ దేశానికి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 450 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 45 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మార్చి నెలలో దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు 1 శాతం పెరిగి 10.94 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025-26) మొత్తం మీద ఇంజనీరింగ్ ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధితో 122.43 బిలియన్ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇంజనీరింగ్ ఎగుమతులను 250 బిలియన్ డాలర్లకు (రెట్టింపు) చేర్చాలన్నది లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం వస్తు ఎగుమతుల్లో ఇంజనీరింగ్ వాటా 27.71 శాతంగా ఉంది. అమెరికా టారిఫ్‌లు బాదేసినా ఆ దేశానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరాయి. జర్మనీకి 14.6 శాతం అధికంగా 4.96 బిలియన్ డాలర్లు, యూకేకి 18.2 శాతం అధికంగా 4.74 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనాకు 32 శాతం అధికంగా 3.53 బిలియన్ డాలర్లు, కొరియాకి 3 బిలియన్ డాలర్లు (16.7 శాతం అధికం) చొప్పున ఎగుమతులు వెళ్లాయి. గత ఆర్థిక సంవత్సరంలో మోటారు వాహనాలు, కార్లు, టూ వీలర్లు, రాగి, ఐరన్ అండ్ స్టీల్, ఎలక్టరిక్ మెషినరీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్ విడిభాగాలు, మెడికల్, సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్ల ఎగుమతులు తగ్గాయి.
0 Comments