ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమవుతున్నట్టు ఎంపీ రాఘవ్ చద్దా చేసిన ప్రకటనపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 'బీజేపీ మరోసారి పంజాబీలకు గట్టి దెబ్బ కొట్టింద'ని ఎక్స్‌లో ఆయన పోస్ట్ పెట్టారు. ఒకే ఒక్క వాక్యంతో తన స్పందన తెలియజేశారు. ఈ పరిణామంపై ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశముంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఇదే విధంగా స్పందించారు. పంజాబ్‌కు బీజేపీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఆపరేషన్ లోటస్‌ను గతంలో శరద్ పవార్, శివసేన (యూబీటీ), కాంగ్రెస్ పార్టీలపైనా ప్రయోగించిందని గుర్తు చేశారు. పంజాబ్‌లో కమలం పార్టీ ఆటలు చెల్లవని వ్యాఖ్యానించారు. ''పంజాబ్‌కు బీజేపీ ద్రోహం చేసింది. ఇదే వాషింగ్ మెషీన్‌ను శరద్ పవార్, శివసేన (యూబీటీ), కాంగ్రెస్ పార్టీల పైకి ఉపయోగించారు. పంజాబ్‌లో బీజేపీకి పట్టు లేదు. బీజేపీలో చేరుతున్న ఆ ఏడుగురు ఎంపీలు పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించరు, వాళ్లు దేశద్రోహులు. ఫిరాయింపు ఎంపీలకు బీజేపీలో ఏమీ దక్కదు. పొత్తు పెట్టుకున్న పార్టీని నాశనం చేయడం బీజేపీ నైజం. పంజాబ్ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. పంజాబ్ ప్రజలు నాకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నార''ని భగవంత్ మాన్ అన్నారు. తమ పార్టీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అనురాగ్ ధంధా మాట్లాడుతూ.. ''ఈ నాయకుల స్వభావాన్ని దేశం మొత్తం చూసింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలో ఆప్ మళ్లీ అధికారంలోకి వస్తుందని వారికి తెలుసు. పంజాబ్ ప్రజలు వారికి తగిన విధంగా సమాధానం ఇస్తార''ని వ్యాఖ్యానించారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ శుక్రవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిశారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో వారికి పుష్పగుచ్చాలతో నబిన్ సాదర స్వాగతం పలికారు.
0 Comments