హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున భార్యతో కలిసి సరదాగా గడపడానికి వచ్చిన శ్యామ్ రాజ్ అనే యువకుడు అతివేగంగా వచ్చిన లగ్జరీ కారు ప్రాణాలు తీసింది. కొత్తగా పెళ్లైన ఈ జంట ఫొటోలు దిగుతుండగా, జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చిన కారు ఫుట్‌పాత్‌పై ఉన్న శ్యామ్ రాజ్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదానికి కారణమైన మెర్సిడెస్ బెంజ్ కారు డ్రైవర్, ఘటన జరిగిన వెంటనే వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన కారు బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ పేరు మీద రిజిస్టర్ అయి ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ సంస్థ ప్రతినిధుల ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments