దేశంలో ఐటీ సంస్థల ఆదాయ వృద్ధి మెరుగుపడేలా చూడటం, అలాగే కంపెనీల్లో కృత్రిమ మేథ, సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు నాస్కామ్ కొత్త చైర్మన్‌గా నియమితులైన శ్రీకాంత్ వెలమకన్ని తెలిపారు. ఏఐ యుగంలో భారత్ మరింత మెరుగ్గా, దూకుడుగా పోటీపడేలా చూసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. టెక్నాలజీపై కంపెనీలు ప్రస్తుత స్థాయికి మించి వెచ్చించాల్సిన అవసరం ఉందని, టెక్నాలజీ పురోగతి వల్ల మనుషుల కన్నా మెషిన్లు మెరుగ్గా పనులు పూర్తి చేయగలిగినా, మనుషులు పోషించాల్సిన పాత్ర ప్రాధాన్యత తగ్గిపోదని తెలిపారు. ఏఐ ఆధిపత్యం కనిపిస్తున్న తరుణంలో కూడా గత ఏడాది నికరంగా ఉద్యోగుల సంఖ్య పెరగడం సానుకూలాంశమని ఆయన పేర్కొన్నారు. ఏఐ పురోగతితో చిన్నా, పెద్ద కంపెనీలు తమ వ్యాపారాలను సరికొత్తగా తీర్చిదిద్దుకునేందుకు అసాధారణ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని శ్రీకాంత్ వివరించారు.
0 Comments