Ad Code

ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం బాబ్ వరల్డ్ లైట్ యాప్ : చేతులు కలిపిన బ్యాంక్ ఆఫ్ బరోడా, రిలయన్స్ జియో


ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'బాబ్ వరల్డ్ లైట్' అనే మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను జియోఫోన్ ప్రైమా 4జీ పరికరంలో ఇరు సంస్థలు ప్రారంభించాయి. తక్కువ ధరలో లభించే ఫోన్లలో కూడా పూర్తిస్థాయి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. సాధారణంగా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు కేవలం ఖరీదైన స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే పనిచేస్తాయి. కానీ బాబ్ వరల్డ్ లైట్ యాప్ దీనికి భిన్నంగా తక్కువ ఇంటర్నెట్ వేగంతో కూడా పనిచేసేలా రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కీప్యాడ్ సహాయంతో సులభంగా బ్యాంకింగ్ పనులు చేసుకునేలా దీనిని అభివృద్ధి చేయడం విశేషం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల వారు కూడా ఈ యాప్‌లో సులభంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా యూపీఐ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడం, వేరొకరికి డబ్బు పంపడం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా విద్యుత్ బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీచార్జ్‌లు కూడా చేసుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని కొత్త ఫీచర్లు యాడ్ చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జియోఫోన్ ప్రైమా 4జీ కొనేవారికి ఈ యాప్ ఫోన్లో ముందే ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. ఒకవేళ లేకపోతే జియోస్టోర్ నుండి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ భాగస్వామ్యం గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈఓ డాక్టర్ దేవదత్త చంద్ర్ మాట్లాడుతూ డిజిటల్ బ్యాంకింగ్‌ను స్మార్ట్‌ఫోన్ పరిధి దాటించి సామాన్యులకు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఫీచర్ ఫోన్ వాడేవారి సంఖ్య దేశంలో భారీగా ఉందని, వారికి సురక్షితమైన సేవలు అందించడం ద్వారా డిజిటల్ అంతరాన్ని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది తమ బ్యాంకుకు కొత్త ఖాతాదారులను చేర్చుకోవడానికి, వారితో మమేకం అవ్వడానికి గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. రిలయన్స్ జియో అధ్యక్షుడు డాక్టర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడికి డిజిటల్ సేవలు తక్కువ ధరలో అందించడమే జియో లక్ష్యమని తెలిపారు. జియోఫోన్ ద్వారా ఇప్పటికే కోట్లాది మందికి ఇంటర్నెట్ చేరువయ్యిందని, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిసి బ్యాంకింగ్ సేవలను కూడా సులభతరం చేస్తున్నామని చెప్పారు. 

Post a Comment

0 Comments

Close Menu