Ad Code

డ్వాక్రా మహిళలకు రూ 2 లక్షల వరకు రుణం పొందే వెసులుబాటు !


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు డ్వాక్రా సంఘాల మహిళలకు తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో పెట్టుబడుల కోసం రూ లక్ష రూపాయల వరకు ఆర్దిక సాయం అందుతోంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసారు. దీంతో అవసరమైన వారికి రూ 2 లక్షల వరకు రుణం పొందే వెసులుబాటు కల్పించారు. స్త్రీనిధి లో భాగంగా ఎలాంటి షూరిటీ లేకుండానే రూ 2 లక్షల వరకు రుణ పరిమితి పొందే అవకాశం కలిగింది. గరిష్టంగా 11 శాతం వడ్డీతో ఈ రుణాలు మంజూరు చేసే విధంగా కార్యాచరణ ఖరారు చేసారు. అదే విధంగా లబ్దిదారు దరఖాస్తు చేసిన తరువాత అన్ని అర్హతలు ఉంటే 48 గంటల్లోనే వారి ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది. కాగా ప్రభుత్వం 2026-27 ఆర్దిక సంవత్సరానికి 1.50 లక్షల మందికి రుణాలు అందించేందుకు ప్రణాళికలు ఖరారు చేసింది. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం సెర్ప్ పరిధిలో దాదాపు 8.43 లక్షల సంఘాలు ఉండగా అందులో దాదాపు 85.75 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. పారిశ్రామిక వేత్తలుగా ఎదగటానికి వారికి ఆర్దికం గా ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు ఆ పరిమితిని రూ 2 లక్షలకు పెంచారు. అయితే రుణం పొందాలంటే గతంలో తీసుకున్న రుణాల ను సక్రమం నిర్దేశించిన సమయం మేరకు చెల్లించటంతో పాటుగా బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా అర్హత సాధించాలి. అదే విధంగా దళిత, గిరిజన మహిళలకు మరింత ప్రోత్సాహం అందించేలా 'ఉన్నతి' పథకం కింద మరో రూ. 1 లక్ష వరకు ఎలాంటి వడ్డీ లేకుండా అదనపు రుణాలు అందించనున్నారు. ఈ నెల 21 నుంచి అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

Post a Comment

0 Comments

Close Menu