ఆర్టెమిస్-2 సురక్షితంగా తిరిగి భూమికి చేరుకుంది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహా సముద్రం శాన్‌డియాగో తీరంలో వ్యోమగాముల ఒరాయన్ క్యాప్సుల్ ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5.38 గంటలకు వ్యోమగాములు సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారు. భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవసహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్-2 రికార్డు సృష్టించింది. చంద్రుడి వద్దకు మనుషులను పంపే సంకల్పంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈనెల 1న ఈ ఆర్టెమిస్-2ను ప్రయోగించింది. ఈ యాత్రలో అమెరికా వ్యోమగాములు రీడ్ వైస్‌మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సన్‌లు ఉన్నారు. ఇప్పటివరకు మానవులెవరూ వెళ్లలేని 4,06,771 కిలోమీటర్ల దూరానికి వీరు ప్రయాణించారు. అపోలో-13 రికార్డును కూడా ఈ ఆర్టెమిస్ అధిగమించింది. ఈ యాత్రలో చంద్రుని అవతలి వైపు దృశ్యాలు, సంపూర్ణ సూర్యగ్రహణం వంటి వాటిని కెమేరాలలో బంధించారు. భూమి వాతావరణంలోకి ఒరాయన్ క్యాప్సూల్ అత్యంత వేగంగా ప్రవేశించింది. మూడు భారీ పారాచూట్ల సాయంతో వ్యోమగాములు పసిఫిక్ సముద్ర జలాల్లో లాండ్ అయ్యారు. 'రీడ్, విక్టర్, క్రిస్టినా, జెరెమీలకు స్వాగతం. ఆర్టెమిస్2 వ్యోమగాములు సురక్షితంగా పుడమికి చేరుకున్నారు. దీంతో చంద్రుని చుట్టూ వారి చరిత్రాత్మక 10 రోజుల మిషన్ విజయవంతమైంది' అంటూ ఈసందర్భంగా నాసా వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ ఎక్స్‌లో చేసిన ఓ పోస్టులో పేర్కొంది. ఆర్టెమిస్2 విజయవంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ట్రూత్ సోషల్ వేదికగా సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. 'త్వరలో మీ అందరినీ వైట్‌హౌస్‌లో కలుసుకోవాలని ఎదురుచూస్తున్నా. మన తదుపరి అడుగు.. అంగారక గ్రహం' అని ట్రంప్ తన పోస్టులో రాశారు.
0 Comments