భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానాశ్రయాల్లో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సేవలను దేశవ్యాప్తంగా 24 ప్రధాన విమానాశ్రయాలకు విస్తరించారు. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే జాతీయ విమానయాన విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటి ఉడాన్ యాత్రి కేఫ్ 2024, డిసెంబర్ 19న కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైంది. దీనికి లభించిన విశేష స్పందనతో తదుపరి కేఫ్‌ను చెన్నై విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇప్పుడు ఈ సేవలు హైదరాబాద్, విజయవాడ, ముంబై, అహ్మదాబాద్, పూణే, సూరత్, భువనేశ్వర్, కోయంబత్తూర్, త్రివేండ్రం, మంగళూరు, రాజ్‌కోట్, చండీగఢ్, జమ్మూ, పాట్నా, ఇండోర్, అమృత్‌సర్, వారణాసి, గ్వాలియర్, అగర్తలా, జైపూర్, లక్నో మరియు అరుణాచల్ ప్రదేశ్‌లోని హోలోంగి వంటి 24 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. లోక్‌సభలో మంత్రి మురళీధర్ మోహోల్ మాట్లాడుతూ.. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ నమూనాలో నడిచే విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి తక్కువ ధరల అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని ఆపరేటర్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన ఆహారాన్ని సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకే అందించడం ఈ కేఫ్‌ల ప్రధాన ఉద్దేశం. ఈ మెనూలో మంచినీళ్ల బాటిల్ కేవలం 10 రూపాయలకే లభిస్తుంది. అలాగే ఒక కప్పు టీ ధర 10 రూపాయలు, కాఫీ ధర 20 రూపాయలుగా నిర్ణయించారు. సమోసా 20 రూపాయలకే అందుబాటులో ఉంది. వీటికి అదనంగా ప్రతిరోజూ ఒక ప్రత్యేకమైన తీపి పదార్థం కూడా 20 రూపాయలకే విక్రయిస్తారు.
0 Comments