Ad Code

22వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు టీజీ ఆర్టీసీ జేఏసీ ప్రకటన !


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ ఈ నెల 22వ తేదీ మొదటి షిఫ్ట్ నుంచే సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేయడం, కార్మిక యూనియన్ల పునరుద్ధరణ వంటి అంశాలను ప్రధాన డిమాండ్లుగా కార్మికులు తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ, అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రత్యక్ష పోరాటమే శరణ్యమని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ సమ్మెకు వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు ఈ వివాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని, కార్మికులు ఎప్పుడైనా తన నివాసానికి వచ్చి చర్చించవచ్చని పేర్కొన్నారు. అయితే, మంత్రి తీరుపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు. అధికారికంగా చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సమ్మె గనుక జరిగితే రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిచిపోయి సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu