ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సాగుతున్న భారీ ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అందించిన పక్కా సమాచారంతో ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో పట్టణ సీఐ, సిబ్బంది పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహస్యంగా సాగుతున్న అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు సభ్యుల ముఠాను గుర్తించగా, అందులో ఎమ్మిగనూరు కు చెందిన మహమ్మద్ పాషా వలి, షరీఫ్, రంగాచారి, పెద్దతుంబలంకు చెందిన పవన్ కుమార్ అనే నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఆదోని చెందిన శివమూర్తి, శిరుగుప్పకు చెందిన పీరా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.నిందితుల నుంచి రూ.22 లక్షల నగదుతో పాటు 4 ఖరీదైన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు ‘డెక్కన్ 247’ పేరుతో ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను క్రియేట్ చేసి, దాని ద్వారా అక్రమంగా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బెట్టింగ్ కోసం సంప్రదించే వారికి ఈ ముఠా సభ్యులు ప్రత్యేక లాగిన్ ఐడీలను కేటాయించి, యాప్ ద్వారా పందేలు కాసేలా పక్కాగా వ్యవస్థను ఏర్పాటు చేయడం గమనార్హం.
0 Comments