ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 'ర్యాపిడో' కలిసి ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టాయి. పర్యాటకులు కేవలం ఒక ప్రయాణికుడిలా కాకుండా, ఆ ప్రాంత విశిష్టతను తెలుసుకునే యాత్రికుడిలా ఫీలయ్యేలా 'డ్రైవర్ కమ్ టూరిస్ట్ గైడ్' అనే సరికొత్త కాన్సెప్ట్‌ను తీసుకువస్తున్నారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల నుంచో, విదేశాల నుంచో వచ్చే పర్యాటకులు ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో దిగాక సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ పర్యాటక శాఖ ర్యాపిడోతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే తొలిసారిగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును మొదటగా విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఈ ప్యాకేజీ కోసం ర్యాపిడోలో 5 స్టార్ రేటింగ్ కలిగిన 280 మంది డ్రైవర్లను (248 మంది ఆటో, 32 మంది క్యాబ్ డ్రైవర్లు) ఎంపిక చేశారు. వీరికి కేవలం డ్రైవింగ్‌లోనే కాకుండా విదేశీ పర్యాటకులతో సులువుగా సంభాషించేలా భాషిణి యాప్, గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటి సాంకేతికతను ఎలా వాడాలో నేర్పిస్తున్నారు. అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, కొండపల్లి కోట వంటి చారిత్రక ప్రదేశాల విశిష్టతను పర్యాటకులకు వివరించేలా వారిని సిద్ధం చేస్తున్నారు. పర్యాటకులతో ఎలా ప్రవర్తించాలి, వారి భద్రతను ఎలా పర్యవేక్షించాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో ర్యాపిడో యాప్‌లో 'టూరిస్ట్ గైడ్' అనే ప్రత్యేక ఐకాన్ కనిపిస్తుంది. పర్యాటకులు దీన్ని క్లిక్ చేయగానే విజయవాడ పరిసరాల్లోని దాదాపు 20 సందర్శనీయ ప్రాంతాల జాబితా వస్తుంది. పర్యాటకులు తమకు నచ్చిన చోటును ఎంచుకోగానే, శిక్షణ పొందిన డ్రైవర్ కమ్ గైడ్ అక్కడకు చేరుకుంటారు. ఈ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులను కేవలం గుడులు, గోపురాలకే పరిమితం చేయకుండా ఉండవల్లి గుహలు, భవానీ ఐలాండ్, సూర్యలంక, మంగినపూడి బీచ్‌లు, నాగార్జునసాగర్, పవిత్ర సంగమం వంటి ప్రదేశాలను చూపిస్తారు. విజయవాడ స్పెషల్ సున్నుండలు, బందరు హల్వా, రొయ్యల ఇగురు, వంకాయ పకోడి వంటి నోరూరించే స్థానిక వంటకాలను పర్యాటకులకు పరిచయం చేస్తారు. విజయవాడలో ఈ ప్రయోగం విజయవంతమైతే, తదుపరి దశలో విశాఖపట్నం, తిరుపతి నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. దీనివల్ల పర్యాటకులకు భద్రతతో కూడిన సులభమైన ప్రయాణం లభించడమే కాకుండా, డ్రైవర్లకు అదనపు ఆదాయం, రాష్ట్రానికి మంచి గుర్తింపు లభిస్తుంది.
0 Comments