భారత్ లోని పోర్టుల నుంచి కూడా అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తోందంటూ యూఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రెగర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మా బేస్ లు, పోర్టులన్నీ ధ్వంసమయ్యాయని, దీంతో మేం భారత పోర్టులపై నుంచి ఇరాన్ పై దాడులు చేయాల్సి వస్తోందన్నారు. ఇది సరికాదన్నారు. నేవీ చెప్పేదీ అదే అన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అమెరికన్ ఆర్మీ మాజీ కల్నల్ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. నిన్న భారత్ నుంచి తిరిగి వెళ్తున్న ఇరాన్ నౌకను శ్రీలంక సమీపంలో అమెరికా జలాంతర్గామి దాడి చేసి ముంచేసింది. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత పోర్టుల్ని ఇరాన్ పై దాడులకు అమెరికా వాడుతుందన్న వాదన మరింత బలపడింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమని తేల్చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో వీటికి కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి ఆరోపణలపై అప్రమత్తంగా ఉండాలని అందరినీ కోరింది. మధ్యప్రాచ్యంలో సంఘర్షణపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను పెంచకుండా ఉండాలని, పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.
0 Comments