Ad Code

కెనడాలోకి ప్రవేశం లేని ఎయిర్ ఇండియా విమానం : చైనా గగనతలంలో యూటర్న్‌


కెనడాకు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత చైనా గగనతలంలో యూటర్న్‌ తీసుకున్నది. సుమారు ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. కెనడాలోకి ప్రవేశించడానికి అనుమతి లేని విమానాన్ని ఎయిర్ ఇండియా పొరపాటున నడపడటంతో ఈ సంఘటన జరిగింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ185 విమానం మార్చి 19న ఉదయం 11:34 గంటలకు ప్రయాణికులతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరింది. కెనాడాలోని వాంకోవర్‌ చేరుకునేందుకు తూర్పు మార్గంలో ప్రయాణించింది. కాగా, సుమారు నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత చెనా గగనతలంలోని కున్మింగ్ సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం యూ టర్న్‌ తీసుకున్నది. మరో నాలుగు గంటలు తిరిగి వెనక్కి ప్రయాణించింది. మొత్తం 7 గంటల 54 నిమిషాల ప్రయాణం తర్వాత గురువారం రాత్రి 7.19 గంటలకు బయలుదేరిన ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఆ తర్వాత అందులోని ప్రయాణికులు, విమాన సిబ్బంది దిగిపోయారు. ప్రస్తుతం కెనడా సర్వీసుల కోసం కేవలం బోయింగ్ 777-300ఈఆర్‌ విమానాలను మాత్రమే నడపడానికి ఎయిర్‌ ఇండియాకు అనుమతి ఉన్నది. అయితే మార్చి 19న కెనడాకు ప్రయాణం కోసం బోయింగ్ 777-200ఎల్‌ఆర్‌ విమానాన్ని ఎయిర్‌ ఇండియా వినియోగించింది. సుమారు నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఈ పొరపాటును గుర్తించింది. దీంతో ఆ విమానం వెనక్కి వచ్చింది. కాగా, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై ఎయిర్‌ ఇండియా క్షమాపణలు చెప్పింది. వారికి వసతి కల్పించినట్లు తెలిపింది. శుక్రవారం ఉదయం వాంకోవర్‌కు బయలుదేరినట్లు ఎయిర్ ఇండియా ధృవీకరించింది.

Post a Comment

0 Comments

Close Menu