ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా మందస రోడ్డు రైల్వే స్టేషన్‌లో బ్రహ్మపుర - విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18531/18532) రైలు నిలుపుదలను (హాల్ట్) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారికంగా ప్రారంభించారు. స్థానిక నాయకులు వెంకన్న చౌదరితో కలిసి ఆయన రైలుకు పచ్చజెండా ఊపి ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మందస ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఈ రైలు నిలుపుదల కోసం విజ్ఞప్తి చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తాను వ్యక్తిగతంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఈ హాల్ట్‌ను మంజూరు చేయించినట్లు వెల్లడించారు. ఈ స్టాపింగ్ అందుబాటులోకి రావడంతో మందస మరియు చుట్టుపక్కల మండలాల ప్రజలకు శ్రీకాకుళం, విశాఖపట్నం మరియు బ్రహ్మపుర వంటి ప్రధాన నగరాలకు ప్రయాణం సులభతరం కానుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు మరియు వ్యాపారస్తులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైల్వే మౌలిక వసతుల కల్పనలో ఉత్తరాంధ్రకు పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
0 Comments