Ad Code

గుంటూరు,విశాఖపట్నంలో ఆహార నాణ్యత పరీక్షల కోసం అత్యాధునిక ప్రయోగశాలలు


ఆంధ్రప్రదేశ్ లో ఆహారభద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలను చేపడుతుందని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలో ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు మరియు విశాఖపట్నంలలో ఆహార నాణ్యత పరీక్షల కోసం అత్యాధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆహార నాణ్యత పరీక్షల కోసం సదుపాయాల కొరత ఉండడంతో, ఆహార నమూనాలను ఇతర రాష్ట్రాలకు పంపాల్సి వస్తుందని, అయితే ఇకపై తిరుమలలో ఏర్పాటు చేసిన నమూనా ఆధారంగా గుంటూరు, విశాఖపట్నంలలో ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కొత్త ల్యాబ్ లు అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ల్యాబ్ లు ఎన్ ఎ బి ఎల్ ప్రమాణాలతో పనిచేసేలా ఏర్పాటు చేయబడతాయి అని ఆయన అన్నారు.విశాఖపట్నం, గుంటూరులో ల్యాబ్ లు త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, ఈ కేంద్రాలలో ఆహార నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించి కల్తీ ఆహారాన్ని గుర్తించేందుకు సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా ఆహార భద్రతతో పాటు, ప్రజల ఆరోగ్య రక్షణ కూడా సాధ్యమవుతుందన్నారు. తిరుమలలో ఏర్పాటుచేసిన ల్యాబ్ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 24గంటలు పనిచేసే విధంగా రూపొందించారని దీంతో ముడిసరుకుల నాణ్యత తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ల్యాబ్ లో అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, ఇదే తరహాలో గుంటూరు, విశాఖపట్నం ల్యాబ్ లను సైతం అత్యాధునిక పరికరాలతో సిద్ధం చేస్తామన్నారు. ఈ ల్యాబ్ ల స్థాపనతో రాష్ట్రంలో కల్తీఆహారంపై నియంత్రణ పెరగడమే కాకుండా, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభం అవుతుందని స్పష్టం చేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఆహార భద్రత వ్యవస్థను బలోపేతం చేసి ప్రజారోగ్యాన్ని కాపాడడంలో ఏపీలో ఏర్పాటు చేయబోతున్న ఈ ల్యాబ్ లు కీలక భూమిక పోషిస్తాయని మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. మూడు నెలలలోనే విశాఖ మరియు గుంటూరులో ల్యాబ్ లు ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu