మహిళల భద్రత కోసం విల్లుపురంలో మంగళవారం ఎన్డీయే కూటమి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అన్నాడీఎంకే రాజ్యసభ్య సభ్యుడు నయనతారను కించపరిచేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ 'మీ కలలను మాకు చెప్పండి. వాటిని నెరవేర్చడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది' అని ప్రజలకు హామీ ఇచ్చారు. సీఎం హామీకి వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించిన షణ్ముగం అనవసరంగా నయనతార ప్రస్తావన తీసుకొచ్చారు. 'కలలు కనమని అబ్దుల్ కలాం మనకు చెప్పారు. మన కలలను తనతో పంచుకోవాలని స్టాలిన్ అడుగుతున్నారు. నాకు నయనతార కావాలని అడిగితే, ఆయన నెరవేరుస్తారా? ఆమెను పెళ్లి చేసుకోవాలనే కల ఎవరికైనా ఉంటే తీరుస్తారా' అని వ్యాఖ్యానించారు. మహిళల భద్రత గురించి ఉద్దేశించిన కార్యక్రమంలో షణ్ముగం ఇలా మాట్లాడడంతో విమర్శలు చెలరేగుతున్నాయి. షణ్ముగం కామెంట్లపై డీఎంకే పార్టీ స్పందించింది. 'మా విధానాలను విమర్శించండి. కానీ, మహిళల గురించి అనుచితంగా మాట్లాడకండి. నయనతారను అవమానించడం ద్వారా మహిళలందరినీ మీరు అవమానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు' అని డీఎంకే పేర్కొంది.
0 Comments