కర్ణాటకలోని బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో కురుస్తోన్న ఆకస్మిక, వడగళ్ల వానల వెనక అమెరికా బిలియనీర్, వ్యాపారవేత్త బిల్ గేట్స్ ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో ఆకస్మిక వర్షాలు కురిశాయి. చాలా చోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. ఈ వర్షాల మీద సోషల్ మీడియాలో బోలెడు వీడియోలు వచ్చాయి. ఇవి కృత్రిమ వర్షాలు అని.. వీటిని “కెమ్‌ట్రైల్ వర్షం” అనే దానితో ముడిపెడుతున్నారు కొందరు. పైగా ఈ కృత్రిమ వర్షాలకు కారణం బిల్ గేట్స్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి చేపట్టిన ప్రాజెక్ట్ SCoPEX అని అంటున్నారు. ఈ ప్రయోగం, వాతావరణంలోని ఎగువ భాగంలో కణాలు ఎలా ప్రవర్తిస్తాయో అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడింది. ఈ ప్రాజెక్ట్, ఆర్కిటిక్‌కు చాలా ఎత్తులో, సుద్ద ధూళిని పోలిన అతి తక్కువ పరిమాణంలో కాల్షియం కార్బోనేట్‌ను విడుదల చేస్తుందని వెల్లడించింది. ఈ క్రమంలో దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ప్రయోగం ముందుకు సాగలేదు. రెండేళ్ల క్రితం అంటే 2024లోనే ఈ ప్రయోగాన్ని నిలిపివేశారు. పైగా ఈ పరిశోధనలోని అంశాలకు భారతదేశంతో గానీ.. ఇండియా వాతావరణ వ్యవస్థలతో గానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం గేట్స్ చేసిన ప్రయోగం వల్లే కర్ణాటకలోని బెంగళూరు సహా చాలా ప్రాంతాల్లో రసాయన వర్షం కురిసిందనే ప్రచారం తెర మీదకు వచ్చింది. బిల్ గేట్స్ చేస్తోన్న క్లౌడ్ సీడింగ్ వల్లే కర్ణాటకలో వడగళ్ల వాన కురిసిందంటూ సోషల్ మీడియాలో బోలెడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరో విషయం ఏంటంటే బిల్ గేట్స్ భారతదేశ వ్యవసాయ కార్యక్రమాల కోసం వాతావరణ మార్పులను తట్టుకునే పరిశోధనకు మద్దతు ఇచ్చారు. వ్యవసాయంలో ఉపయోగించే సాధనాలపై పరిశోధనకు నిధులు సమకూర్చారు. దీంతో కొందరు బిల్ గేట్స్ ఈ వ్యవసాయ పరిశోధన నిధులతో రుతుపవనాలను నియంత్రిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పైగా వర్షం కురిసి ఒక రోజైనా సరే వడగళ్లు ఇంకా కరగలేదని, ఎందుకంటే ఇవి కృత్రిమమైనవి అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ఇవన్నీ వట్టి పుకార్లని, కర్ణాటకలో కురిసిన వడగళ్ల వానకు, బిల్ గేట్స్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. ఇక ఈ వడగళ్లు కరగకపోవడానికి గల కారణాలను కూడా వివరించారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా చల్లని గాలి, వర్షం, ప్రత్యక్ష సూర్యరశ్మిని అడ్డుకునే మేఘావృతమైన వాతావరణం కొనసాగుతున్నప్పుడు.. నేల మీద పడ్డ వడగళ్లు త్వరగా కరిగిపోవని తెలిపారు. నీడ ఉన్న ప్రదేశాలలో, గడ్డిపై, మంచు పెద్ద ముక్కలుగా పేరుకుపోయిన చోట.. అవి కరిగే ప్రక్రియ నెమ్మదిస్తుందని తెలిపారు. ఇది ఒక సాధారణ ప్రక్రియ అని.. ఈ కరగని వడగళ్లు కృత్రిమ వర్షానికి లేదా రసాయన చర్యకు రుజువులు కాదని అంటున్నారు.
0 Comments