Ad Code

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి !


హైదరాబాద్ లోని చిలకలగూడ ఠాణా పరిధిలో ప్రేమ విషయంలో మానసిక ఒత్తిడికి గురై ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించానని వెంటపడ్డ యువకుడు దాడిచేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బుధవారం ధర్నా, రాస్తారాకో నిర్వహించారు.  మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా రేబల్లె గ్రామానికి చెందిన గుడిసె కోటేశ్వరరావు, రమాదేవి దంపతులు సికింద్రాబాద్‌ శ్రీనివాసనగర్‌లో ఉంటూ పద్మారావునగర్‌లో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, ఇంటర్‌ చదువుతున్న కుమార్తె జెనిమా (19) ఉన్నారు. జగదీష్‌ అనే యువకుడు, జెనిమా కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జెనిమా కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతోంది. మంగళవారం ఉదయం జెనిమా మాత్రమే ఇంట్లో ఉంది. ఆసమయంలో జగదీష్‌ ఇంటికి వచ్చాడు. కొంత సమయం తర్వాత యువతి తల్లి రమాదేవికి ఫోన్‌ చేసి  మీ కుమార్తె లోపల నుంచి తలుపు గడియపెట్టుకుంది. మీరు త్వరగా రావాలని చెప్పాడు. జెనిమా తల్లి రావడంతో స్థానికులతో కలిసి జగదీష్‌ తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ద్విచక్ర వాహనంపై గాందీఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ కుమార్తెను జగదీష్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా జెనిమాపై దాడికి పాల్పడి ఆపై హత్య చేశాడని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం చిలకలగూడ గాంధీ చౌక్‌ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నర్వ మండలం పెద్దపుడుమూరుకు చెందిన నిందితుడు జగదీష్‌ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓ రామకృష్ణ తెలిపారు. మృతురాలి ఇంట్లో సూసైడ్‌నోట్‌ స్వాదీనం చేసుకున్నామని, అందులో ప్రేమ విషయమై మానసిక ఒత్తిడికి గురైనట్లు ఉందని స్పష్టం చేశారు. మృతురాలి కాళ్లకు గాయాలైనట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu