విధుల్లో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకోవడమే కాకుండా, ఒక హోంగార్డుపై చేయి చేసుకున్నారనే ఆరోపణలపై ప్రముఖ సినీ దర్శకుడు మణిశంకర్ కుమారుడు ప్రేమ్ శంకర్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు ప్రేమ్ అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన మార్చి 1వ తేదీన చోటుచేసుకుంది. ప్రేమ్ శంకర్ తన ఎలక్ట్రిక్ కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 మీదుగా వెళ్తుండగా, ఒక జంక్షన్ సమీపంలో కారు బ్యాటరీ నిలిచిపోయింది. దీంతో కారు ప్రధాన రహదారిపైనే ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్, హోంగార్డు అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి కారును పక్కకు జరపాలని వారు కోరారు. అయితే ప్రేమ్ శంకర్ అందుకు నిరాకరించడమే కాకుండా, కారులో నుంచి దిగడానికి ససేమిరా అన్నారు. వాహనాన్ని తరలించే క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగి, హోంగార్డును పక్కకు తోసేసి దాడికి పాల్పడ్డారు. "కారును పక్కకు జరపడానికి సహకరించమని కానిస్టేబుల్, హోంగార్డు ఎంత వేడుకున్నా ప్రేమ్ శంకర్ వినలేదు. బయటకు రావడానికి నిరాకరిస్తూ హోంగార్డును నెట్టేశారు" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు ప్రేమ్ శంకర్‌ను బలవంతంగా కారులో నుంచి దించి, వాహనాన్ని పక్కకు జరిపారు. అయితే ఆ సమయంలో ప్రేమ్ శంకర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, గాలింపు చేపట్టి బుధవారం (మార్చి 4) ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
0 Comments