ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని వేలేరు గ్రామం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు గల్లంతైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఏడుగురు యువకులు కలిసి భద్రాచలం రామాలయ దర్శనం కోసం వచ్చారు. బుధవారం స్వామివారిని దర్శించుకుని, గురువారం సినిమా చూసి, శుక్రవారం ఉదయం కుక్కునూరు సమీపంలోని వేలేరు వద్ద గోదావరి నదిలోకి స్నానానికి దిగారు. నది లోతు తెలియకపోవడంతో ఐదుగురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో దీపక్, హర్షలు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో భద్రాచలం రామాలయ అర్చకుడు శ్రీకర్ తో పాటు, అమరావతి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు సతీష్ (మదనపల్లి), అభిరామ్ (విజయనగరం), నవదీప్ (ఉయ్యూరు), తేజ (ఉయ్యూరు) ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.
0 Comments