Ad Code

అందుబాటులోకి వచ్చిన కొత్త ఎన్ హెచ్ 565


తెలంగాణ లోని నకిరేకల్ వద్ద మొదలై ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో గల ఏర్పేడు వద్ద ముగిసే నేషనల్ హైవే 565 అందుబాటులోకి వచ్చింది. ఈ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 మదనపల్లి నుంచి నాయుడుపేట వెళ్లే ఎన్ హెచ్ 71తో కలుపుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుపతి వెళ్లాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయ జాతీయ రహదారి దొరికినట్లు అయింది. ఈ కొత్త మార్గం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు, దుత్తలూరు, రాపూరు, వెంకటగిరి, ఏర్పేడు ప్రాంతాల మీదుగా ఈ రహదారి సాగుతుంది. గతంలో మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం నుండి హైదరాబాదుకు రాత్రిపూట అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే జనాలు ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా పుల్లల చెరువు నుండి వెల్దుర్తి మీదుగా దారుణంగా రోడ్డు ఉండేది. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ఈ ఎన్ హెచ్ 565 నిర్మాణం చేయడంతో ప్రస్తుతం ఆ కష్టాలు తొలగిపోయాయి. ప్రయాణికులకు ప్రయాణం చాలా సులభతరంగా మారింది. NH565 లోని 20 కిలోమీటర్ల రహదారి విస్తరణకు అటవీ అనుమతుల జాప్యం వంటి అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే 2024లో ఈ పనులకు లైన్ క్లియర్ కావడంతో, వేగవంతం చేసి నిర్దేశిత సమయం కంటే ముందుగానే పూర్తి చేశారు. అటవీ ప్రాంతంలో సాగే ఈ మార్గం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. గతంలో పుల్లలచెరువు నుండి వెల్దుర్తి మండలం వరకు ప్రయాణం చేయాలంటే 50 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 20 నిమిషాల్లోనే ప్రయాణం సాగుతుంది. దీంతో సమయం బాగా ఆదా అవుతుంది. 20 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం కోసం 393 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అటవీ మరియు ఘాట్ ప్రాంతాలను కలుపుతూ 16 వంతెనలు, ఎనిమిది అండర్ పాస్ లు ఈ మార్గంలో ఏర్పాటయ్యాయి. మొత్తం 420 కిలోమీటర్ల పొడవైన ఈ హైవేలో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్, నల్గొండ, దేవరకొండ, కనగల్ ప్రాంతాల మీదుగా వచ్చి, మాచర్ల వద్ద ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఏర్పేడు వద్ద ఎడమవైపుకు వెళితే కాళహస్తి కుడివైపుకు వెళితే తిరుపతిని చేరుకునేలా ఈ మార్గం ఉంది. ఈ జాతీయ రహదారి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు తిరుపతి వెళ్లడం తేలిక అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu