తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి 3.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తాండూరు మండలం గౌతాపూర్ సమీపంలోని ఒక పాలిష్ యూనిట్‌లో అక్రమంగా గంజాయి నిల్వ ఉంచారన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్కడ కార్మికుడిగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి ముస్తాకిన్ వద్ద గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. తన స్వరాష్ట్రమైన బీహార్ నుండి గంజాయిని కొనుగోలు చేసి తీసుకొచ్చి, తాను పనిచేస్తున్న పాలిష్ యూనిట్ లోని ఇతర కార్మికులకు మరియు చుట్టుపక్కల ఉండే కూలీలకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ముస్తాకిన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
0 Comments