Ad Code

ఏప్రిల్ 2 నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి : ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు


తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 'ధరణి' చిక్కుముడులను విప్పుతూ రైతులకు అత్యంత పారదర్శకంగా, సులభతరమైన సేవలందించడమే లక్ష్యంగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ (ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజిమెంట్ సిస్టమ్)ను ఏప్రిల్ 2 నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్ఐసి అధికారులతో మంత్రి గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా భూపరిపాలన సేవలను మరింత వేగవంతంగా అందించడానికి రెవెన్యూ. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ భూభారతి పోర్టల్‌ను అభివృద్ది చేసినట్లు తెలిపారు. ప్రతి భూ లావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా ఈ పోర్టల్‌ను రూపొందించామన్నారు. ఈ భూభారతి పోర్టల్‌ను నారాయణపేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ పైలట్ మండలాల్లో మెరిట్- డీమెరిట్‌లను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులుచేర్పులు చేసి రెండవ దశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 'ధరణి'ని బంగాళాఖాతంలో కలిపి భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చామన్నారు. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయవిక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి సర్వే నెంబరుకు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్‌ను కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్షా లేని ఐదు గ్రామాల్లో రీ సర్వే నిర్వహించి భూధార్ నెంబర్‌ను కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా కోణంలోనే ఉంటుందన్నారు. ఒక క్లిక్‌తో రైతులకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా చాలా సులువుగా, సులభతరంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను రూపొందించామని, ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావలసిన సమాచారం లభిస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu