ఐసీసీ టీ20 ఫైనల్ మ్యాచ్ ను జియోహాట్‌స్టార్ లో అత్యధికంగా చూశారు. మ్యాచ్ క్లైమాక్స్ సమయంలో ఏకంగా కోట్ల మంది వీక్షకులు ఏకకాలంలో లైవ్‌లో ఉండటం విశేషం. నిన్న జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్, మూడోసారి పొట్టి ఫార్మాట్ టైటిల్‌ను ముద్దాడింది. తద్వారా సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 19వ ఓవర్‌లో భారత్ గెలుపు ఖాయమవగానే వ్యూయర్‌షిప్ 74.5 కోట్లకు చేరగా, మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రజెంటేషన్ సమయానికి అది ఏకంగా 82.1 కోట్లకు చేరి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్ వీక్షణల పరంగా పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో నమోదైన 6.5 కోట్ల పీక్ వ్యూయర్‌షిప్‌ను ఈ మ్యాచ్ సునాయాసంగా దాటేసింది. గతంలో భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌కు ఉన్న 5.9 కోట్ల రికార్డు కూడా కనుమరుగైంది. 2024 టీ20 వరల్డ్ కప్ లో డిస్నీ+ హాట్‌స్టార్‌లో నమోదైన 5.3 కోట్ల వ్యూయర్‌షిప్‌తో పోలిస్తే ఇది కొన్ని రెట్లు అధికం కావడం గమనార్హం. మ్యాచ్ ప్రారంభానికి ముందు రికీ మార్టిన్ ప్రదర్శన సమయంలో 2.1 కోట్లుగా ఉన్న సంఖ్య, భారత్ నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ వికెట్లు పడుతున్న కొద్దీ పెరుగుతూ వచ్చింది. న్యూజిలాండ్ చివరి వికెట్ పడే సమయానికి కోట్లాది మంది అభిమానులు డిజిటల్ తెరలకు హత్తుకుపోయారు. ఈ విజయంతో భారత్ కేవలం క్రికెట్ మైదానంలోనే కాకుండా డిజిటల్ రంగంలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
0 Comments