Ad Code

'డిజిటల్ అరెస్ట్' పేరుతో రిటైర్డ్ జడ్జీని రూ. 1.66 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు !


హైదరాబాద్‌లో ఒక రిటైర్డ్ జడ్జీని టార్గెట్ చేసిన సైబర్ వంచకులు, 'డిజిటల్ అరెస్ట్' పేరుతో ఏకంగా రూ. 1.66 కోట్లు దోచుకున్నారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము సీబీఐ అధికారులమని మాజీ జడ్జిని నమ్మించారు. మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన రెండు మొబైల్ నంబర్ల ద్వారా మహిళలకు అభ్యంతరకర కాల్స్ వెళ్తున్నాయని, మీపై విచారణ జరుగుతోందని భయపెట్టారు. కేసు ముగిసే వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తూ ఆయన్ని 'డిజిటల్ అరెస్ట్' చేసినట్లు నటించారు. నేరగాళ్లు అంతటితో ఆగకుండా ఇందిరానగర్‌లో మీపై కేసు నమోదైందని, మానవ అక్రమ రవాణా ఆరోపణలు కూడా ఉన్నాయని నమ్మబలికారు. దీనిపై సుప్రీంకోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని చెప్పి మానసిక ఒత్తిడికి గురిచేశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకుంటే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని బెదిరించారు. విచారణ పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికి, బాధితుడి బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. అరెస్ట్ అయితే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందన్న భయంతో ఆ రిటైర్డ్ జడ్జి విడతల వారీగా మొత్తం రూ. 1,66,00,000 నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. ఎంతకీ నగదు తిరిగి రాకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0 Comments

Close Menu