ఢిల్లీలో మార్చి 15న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలో భారత క్రికెట్‌కు విశేష సేవలు చేసిన పలువురు ఆటగాళ్లు, దిగ్గజాలను సత్కరించనున్నారు. ఈ ఏడాది పురుషుల విభాగంలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డు ప్రదానం చేయనున్నారు. 2024-25 సీజన్‌కు గాను ఆయన ఈ అవార్డును రెండోసారి అందుకోనున్నారు. మహిళల విభాగంలో ఇదే అవార్డును భారత స్టార్ బ్యాటర్ స్మృతి మందన ఐదోసారి అందుకోనున్నారు. అలాగే భారత మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్ , రోజర్ బిన్నిలకు బీసీసీఐ అత్యున్నత గౌరవంగా భావించే కల్నల్ సీకే నాయుడు అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నారు. భారత క్రికెట్‌కు వారు చేసిన అమూల్యమైన సేవలకు గాను ఈ పురస్కారం ఇవ్వనున్నారు. భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు మహిళల విభాగంలో బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేయనున్నారు. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం ఇవ్వబడుతోంది. అంతేకాకుండా ఈ వేడుకలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత జట్లను కూడా ప్రత్యేకంగా సత్కరించనున్నారు. దేశీయ క్రికెట్‌లో ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు కూడా అవార్డులు అందజేయనున్నారు. ఈ సీజన్‌లో దేశీయ టోర్నీల్లో నాలుగు ట్రోఫీలు గెలిచి, రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రత్యేక అవార్డు అందుకోనుంది. ఈ కార్యక్రమం భారత క్రికెట్ ప్రపంచానికి మరో ముఖ్యమైన వేడుకగా నిలవనుంది.
0 Comments