మొదటి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుని టాటా మోటార్స్ పంచ్ EV కారును విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.69 లక్షలుగా నిర్ణయించింది. బ్యాటరీ యాజ్-ఎ-సర్వీస్ విధానం కింద వాహనం ధరను గణనీయంగా తగ్గిస్తూ, పంచ్ EVను కేవలం రూ. 6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందిస్తోంది. అంటే కారును తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ ఖర్చును వేరుగా చెల్లించే సౌకర్యాన్ని పొందుతారు. ఈ బ్యాటరీ యాజ్-ఎ-సర్వీస్ ప్లాన్‌లో వినియోగదారులు బ్యాటరీ కోసం ముందస్తుగా పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉండదు. బదులుగా, వారు ఉపయోగించిన దూరాన్ని బట్టి కిలోమీటరుకు కేవలం రూ. 2.60 మాత్రమే చెల్లిస్తారు. ఇది సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. దీంతో రోజువారీ ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కొత్త పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ 30 kWh, 40 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. 30 kWh వేరియంట్ ప్రారంభ ధర రూ. 9.69 లక్షలు కాగా, 40 kWh వేరియంట్ ధర రూ. 12.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. చిన్న బ్యాటరీ ప్యాక్ 30 kWh మోడల్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 365 కి.మీ వరకు ప్రయాణించగలదు. 40 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే టాప్ వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 468 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. ఈ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందించింది. ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే బ్యాటరీని కేవలం 26 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తోనే సుమారు 135 కి.మీ దూరం ప్రయాణించగలదు. కొత్త పంచ్ EVకు జీవితకాల HV బ్యాటరీ వారంటీతో అపరిమిత కిలోమీటర్ల కవరేజ్ అందిస్తామని టాటా ప్రకటించింది. భద్రతా పరంగా కూడా ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ గణనీయమైన అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు ప్రామాణికంగా అందిస్తున్నారు. అలాగే ABS, EBD, ESP వంటి కీలక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్‌కు అదనపు భద్రత కల్పించేందుకు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి. లోపల ప్లష్ లెథరెట్ అల్ట్రా కంఫర్ట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. టెక్నాలజీ పరంగా 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కాక్‌పిట్‌లో ఎంబెడెడ్ నావిగేషన్ వ్యూ అందుబాటులో ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 6 భాషల్లో 200కిపైగా వాయిస్ కమాండ్‌లు, వైర్‌లెస్ ఛార్జర్ కూడా ఉన్నాయి.
0 Comments