Ad Code

ఎంఏయూడీ పర్యవేక్షణ, మార్గదర్శకంలో హైడ్రా పని చేయాలి : తెలంగాణ హైకోర్టు


హైడ్రా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పర్యవేక్షణ, మార్గదర్శకంలో పని చేయాలని తెలంగాణ హైకోర్టు చెప్పింది. ఎలాంటి అనుమతి లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కంచె వేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఆక్రమణ ఆరోపణ రాగానే కంచె వేసే అధికారం ఉందన్న వాదనపై పత్రాలను తమ ముందు ఉంచాలని హైడ్రా స్టాండింగ్‌ కౌన్సిల్‌ను ఆదేశించింది. కాగా, గండిపేట మండలం నార్సింగిలోని 1608 గజాల భూమిపై వివాదం జిల్లా కోర్టు విచారణలో ఉంటే వెంటనే అందులో వేసిన కంచెను తొలగించాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కాపీ అందిన 48 గంటల్లో ప్రక్రియ పూర్తి చేయాలంది. దీనిపై నివేదిక సమర్పించాలంటూ తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. ఆ భూమిలో హైడ్రా బోర్డు తొలగించాల్సిన అవసరం లేదంది. వివాదాస్పద భూమిపై విచారణ కోర్టు పరిధిలో ఉంటే కంచె తొలగించాలంది. కోర్టు పరిధిలోని భూమి చుట్టూ ఉన్న ప్రహరీని హైడ్రా తొలగించిందని, ఆ సంస్థ జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ నార్సింగికి చెందిన జి.రాహుల్‌ యాదవ్‌ సహా ఏడుగురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.రవీందర్‌రెడ్డి వాదిస్తూ 'వివాదాస్పద భూమి మా ప్రైవేట్‌ భూమి. హక్కులు మాకే చెందేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ కేసులో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అందులో ప్రతివాదిగా నార్సింగి మున్సిపల్‌ కమిషనర్‌ కూడా ఉన్నారు. ఇదే భూమికి సంబంధించి మరో పిటిషన్‌ దాఖలైంది. వివాదాస్పద భూమిలో హైడ్రా జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి' అని కోరారు. హైడ్రా కౌన్సిల్‌ వాదనలు వినిపిస్తూ ఎంఏయూడీ పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నా ప్రతిసారి ఆదేశాలు పొందాల్సిన అవసరం లేదన్నారు. ఎంఏయూడీ అనుమతి లేకుండా ఏజెన్సీ సొంత నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu