పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఏడుగురు సైనికుల్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సభ్యులు బంధీలుగా చేసుకున్నారు. ఈ మేరకు బంధీలకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ విడుదల చేసింది. పాకిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీకి, పాక్ ఆర్మీకి మధ్య కొంతకాలంగా ఘర్షణ చెలరేగుతున్న సంగతి తెలిసిందే. గత నెల 31న పాక్ సైనిక స్తావరాలపై 'ఆపరేషన్ హెరాఫ్ 2.0' పేరుతో బీఎల్ఏ మెరుపుదాడులు చేసింది. వారం రోజులపాటు ఇరువైపులా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో రెండు పక్షాలకు చెందిన వారు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సందర్భంగా పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఏడుగురు సైనికుల్ని బీఎల్ఏ బంధీలుగా తీసుకుంది. వీరితోపాటు 10 మంది పాక్ అధికారుల్ని కూడా బంధీలుగా చేసుకుంది. అయితే, ఆ పది మందిని 24 గంటల్లోగా విడుదల చేయగా.. ఏడుగురు సైనికుల్ని మాత్రం బంధించింది. దీని ద్వారా తమ యుద్ధం పాక్ అధికారులు, సాధారణ ప్రజలపై కాదని బీఎల్ఏ చెప్పినట్లైంది. అంటే తాము ప్రజలజోలికి వెళ్లబోమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా బీఎల్ఏ సభ్యులు మాట్లాడుతూ.. పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న తమ బీఎల్ఏ సభ్యుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు పాక్ ప్రభుత్వానికి వారం రోజుల అల్టిమేటమ్ ఇచ్చింది. వారంలోగా పాక్ అరెస్ట్ చేసిన బీఎల్ఏ సభ్యుల్ని విడుదల చేయకుంటే తమ వద్ద బంధీలుగా ఉన్న సైనికుల్ని చంపేస్తామని హెచ్చరించింది. ఇక పాక్ సైనికులతో మాట్లాడించిన ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఇటీవలి ఘర్షణల్లో ఇరువైపులా బంధీలుగా ఉన్న వారిని మార్చుకుందామని ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. బీఎల్ఏ సభ్యుల్ని పాక్ విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న పాక్ ఆర్మీ సభ్యుల్ని విడుదల చేస్తామని బీఎల్ఏ చెప్పింది.
0 Comments