విజయవాడ క్యాంప్ ఆఫీస్‌లో ఆపరేషన్ బుడమేరుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జలవనరుల శాఖ ఈఎన్సీ, ఎస్.ఇ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ, సర్వే అధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి రామానాయుడు మాట్లాడుతూ బెజవాడ దుఃఖ దాయనిగా పిలవబడుతున్న బుడమేరుకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో బెజవాడ ముంపు రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆలోచన లక్ష్యంగా ప్రతిరోజు రివ్యూ సమీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. బుడమేరు ఆక్రమణలకు సంబంధించి విద్యాధరపురం నుంచి గుణదల వరకు వీఎంసీ పరిధిలో ఎక్కువ ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించామని మంత్రి రామానాయుడు చెప్పారు. ఈ లిమిట్‌లో 202 ఎకరాలకు గాను 70 ఎకరాలు ఆక్రమణ పాలయింది. ఆక్రమణ స్థలంలో 3051 ఇళ్ల నిర్మాణాలు జరిగాయని గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. బుడమేరు విస్తీర్ణం ఎంతవరకు ఉంది.. ఎంతవరకు ఆక్రమణ జరిగిందో వాస్తవ నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తున్నామని మంత్రి నిమ్మల చెప్పారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు పలు గ్రామాలు, నగరంలో పలు వార్డులు విస్తరించి ఉన్నాయన్నారు. చీమల వాగు, కేసరవల్లి, ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు సామర్థ్యం గట్లు పటిష్ట, లైనింగ్ విస్తరణ చేసేందుకు సమీక్ష చేసామని అన్నారు. అలాగే బుడమేరు ఓల్డ్ ఛానల్ ఇళ్ల, పట్టణ మధ్య నుంచి ప్రవహించడం వల్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి పాములు కాల్వ, ముస్తాబాద్ కెనాల్, ఎనికేపాడు వరకు ఉన్న కాలువకు ప్రత్యామ్నాయంగా విస్తరణతో వరద నీరు మళ్లింపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో అభిప్రాయాలతో వాస్తవ పరిస్థితిపై సమీక్ష చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
0 Comments