కేరళలో చుడీదార్ ధరించి పాఠశాలకు వచ్చిన ఒక ప్రధానోపాధ్యాయురాలిని లోపలికి వెళ్లకుండా కాపలాదారు అడ్డుకున్న సంఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంలో వాచ్ మెన్‌ను సస్పెండ్ చేయగా, దీనికి కారణమైన స్కూల్ మేనేజర్‌పై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొల్లాం జిల్లా కొట్టారక్కర సమీపంలోని ఒక ఎయిడెడ్ పాఠశాలలో సింధు అనే మహిళ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఆమె చుడీదార్ ధరించి స్కూల్‌కు వచ్చారు. అయితే, వాచ్ మెన్ శశాంక్ ఆమెను గేటు వద్దే ఆపి, లోపలికి వెళ్లనివ్వకుండా గేటు వేసేశాడు. చుడీదార్ ధరించి వస్తే లోపలికి అనుమతించవద్దని స్కూల్ మేనేజర్ తనకు ఆదేశాలు ఇచ్చారని వాచ్ మెన్ చెప్పాడు. తన విధులకు ఆటంకం కలిగించడంతో ఆగ్రహించిన హెడ్ మిస్ట్రెస్ సింధు, స్కూల్ గేటు ముందే బైఠాయించి ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చర్చలు జరిపిన తర్వాతే ఆమెను పాఠశాల లోపలికి అనుమతించారు. ఈ విషయం కేరళ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో మేనేజర్ సురేష్ కుమార్ స్పందిస్తూ తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని బుకాయించారు. అయితే, నిరసనల నేపథ్యంలో వాచ్ మెన్‌ను విధుల్లోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్కూల్లో పనిచేయాలంటేనే ఇప్పుడు భయం వేస్తోంది. మేనేజర్ ఆదేశాల మేరకే వాచ్ మెన్ అలా ప్రవర్తించాడు. పోలీసులు అతనిపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు, కానీ ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినందుకు కఠినమైన సెక్షన్లు వేయాలి. నా న్యాయ పోరాటం కొనసాగుతుందని ప్రధానోపాధ్యాయురాలు సింధు అన్నారు.
0 Comments