అమెరికాలోని ఫ్లోరిడా పామ్ బీచ్ లో వున్న ట్రంప్ వ్యక్తిగత రిసార్ట్ లోకి ఓ సాయుధ వ్యక్తి చొరబడ్డాడు. అయితే అప్రమత్తమైన అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆ వ్యక్తిని కాల్చి చంపడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారిక వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మార్-ఎ-లాగో ఉత్తర గేటు గుండా ఒక వాహనం బయటకు వెళ్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగుడు.. తన వాహనంతో అత్యంత వేగంగా లోపలికి దూసుకొచ్చాడు. అప్పటికే అక్కడ కాపలా ఉన్న ఇద్దరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఒక పోలీసు అధికారి వెంటనే అతడిని చుట్టుముట్టారు. అయినా అతడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. నిందితుడి వాహనాన్ని పరిశీలించారు. ఈక్రమంలోనే అందులో ఒక మారణాయుధం, గ్యాస్ క్యాన్ ఉన్నట్లు భద్రతా సిబ్బంది గమనించారు. అప్పటికే నిందితుడు ఆయుధాలను పట్టుకుని కాల్పులు జరపబోయాడు. అయితే భద్రతా సిబ్బంది వాటిని కింద పడేయాలని పదే పదే సూచించింది. అయినా అతడు మొండిగా వ్యవహరించాడు. ముఖ్యంగా భద్రతా బలగాల హెచ్చరికలతో నిందితుడు గ్యాస్ క్యాన్‌ను పక్కన పెట్టినప్పటికీ షాట్‌గన్‌ను మాత్రం వదల్లేదు. ఎదురుగా ఉన్న అధికారులపై కాల్పులు జరిపేందుకు వీలుగా తుపాకీని ఎత్తి పట్టుకున్నాడు. దీంతో ఆత్మరక్షణ కోసం, అధ్యక్షుడి నివాస రక్షణ దృష్ట్యా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తక్షణమే స్పందించి నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మార్టిన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉండగా మృతి చెందిన వ్యక్తిని ఉత్తర కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ టకర్ మార్టిన్‌గా అధికారులు గుర్తించారు. అదృష్టవశాత్తు ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గానీ, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ గానీ మార్-ఎ-లాగోలో లేరు. వారిద్దరూ వాషింగ్టన్ డీసీలోని శ్వేతసౌధంలో ఉన్నట్లు సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మీ ధృవీకరించారు. అయితే అధ్యక్షుడి వ్యక్తిగత నివాసంలోకి ఇంతటి భద్రతను దాటుకుని ఎలా రాగలిగాడనే అంశంపై ఎఫ్‌బీఐ (FBI) లోతైన విచారణ ప్రారంభించింది. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని కొందరు భావిస్తుండగా.. దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
0 Comments