ఆంధ్రప్రదేశ్ లో ఏడేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించగా దాన్ని వ్యతిరేకిస్తూ మరిన్ని అంశాలపై దర్యాప్తు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి కోరడం జరిగింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఆమె ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ట్రయల్ కోర్టు తీర్పు తర్వాత కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమెకు అక్కడా ఊరట దక్కలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య 2019లో జరిగింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. నాలుగేళ్ల తర్వాత దాన్ని పూర్తి చేసి అనంతరం గతేడాది సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. అనంతరం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైదరాబాద్ సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అనంతరం సీబీఐ కోర్టుకు వెళ్లిన సునీత.. తన తండ్రి హత్య కేసులో చాలా అంశాల్ని సీబీఐ వదిలేసిందని పేర్కొంది. అయితే దీనిపై సీబీఐ కోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో రెండు అంశాల వరకే సీబీఐ దర్యాప్తును పరిమితం చేసింది. దీంతో మరోసారి వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది. హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశాల మేరకే సీబీఐ తదుపరి దర్యాప్తు జరిపేలా అనుమతి ఇచ్చింది. ఇంతకు మించి సునీత కోరుతున్నట్లుగా దర్యాప్తు చేయించేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టులో సునీతకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్న ఉత్తర్వును మాత్రం సవరించి సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తును మాత్రం యథాతథంగా పూర్తి చేయాలని ఆదేశించింది.
0 Comments