ఆంధ్రప్రదేశ్ లో తన వద్ద పనిచేసే కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబు కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచనలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ పోలీసులకు దర్యాప్తు చేతకాకుంటే చెప్పండి. కేసును సీబీఐకు అప్పగిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇంత దారుణంగా వ్యవస్థలు నిర్వీర్యం అవుతుంటే డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారు అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చేలా ఉద్దేశపూర్వకంగా పోలీసులు చార్జిషీటు దాఖలు చేయడంలో తీవ్ర జాప్యం చేశారని, నిందితుడితో పోలీసులు కుమ్మక్కయ్యారని ఇది స్పష్టం చేస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు దర్యాప్తు చేయడం చేతకాకోతే చెప్పండి - కేసును సీబీఐకు అప్పగిస్తాం అంటూ హెచ్చరించింది. అలాగే గత వైకాపా ప్రభుత్వంతో పాటు ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వానికి సైతం కోర్టు ప్రశ్నలు సంధించింది. నాడు తప్పు చేసిన పోలీస్ అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు, బాధ్యులైన వారిని ఎందుకు వదిలేసింది అంటూ నిలదీసింది. పైగా, ఈ కేసు విచారణను వచ్చే నవంబరు నెల 18వ తేదీ లోపు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించింది. అలాగే, కేసు విచారణ కోసం మార్చి 31వ తేదీ లోపు ఒక సీనియర్ జ్యూడిషియల్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని, జాప్యానికి తావులేకుండా రోజువారీ ప్రాతిపదికన విచారణ సాగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈ కేసులో హైకోర్టు జోక్యం చేసుకుని అడ్డంకులు సృష్టించవద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
0 Comments