జీవితంలో ఏదైనా ముఖ్యమైన బంధాన్ని ఏర్పరుచుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దంటూ హితవు పలికింది. ఈ మేరకు ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు అంగీకారంతో శారీరక సంబంధంపై ప్రశ్నించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్న వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ల ధర్మాసనం విచారించింది. నిందితుడి బెయిల్ కేసులో భాగంగా ఫిర్యాదుదారురాలిని.. దుబాయ్ కు ఎందుకు వెళ్లావు, అక్కడ శారీరక సంబంధం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. "అంగీకారం ఉన్నప్పటికీ, మేము పాతకాలపు వారమై ఉండవచ్చు, కానీ వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి పూర్తిగా తెలియని వ్యక్తులు. పెళ్లికి ముందు శారీరక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి" అని పీటీఐ ధర్మాసనం వ్యాఖ్యలను ఉటంకించింది."వారి సంబంధం ఎంత ఉన్నా, వివాహానికి ముందు శారీరక సంబంధాలలో ఎలా నిమగ్నమవుతారో మాకు అర్థం కావడం లేదు. మేము పాతకాలపు వారమై ఉండవచ్చు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, పెళ్లికి ముందు ఎవరినీ నమ్మొద్దు" అని స్పష్టం చేశారు. మహిళ న్యాయవాది వాదన ప్రకారం, 2022లో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా వీరిద్దరు పరిచయం అయ్యారు. నిందితుడు పెళ్లి హామీతో ఢిల్లీలో పలుమార్లు, ఆపై దుబాయ్‌లో ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ వాదనపై ధర్మాసనం స్పందిస్తూ, "ఆమె అంత కఠినంగా ఉంటే, వివాహానికి ముందే అక్కడికి వెళ్లరాదు. మేము వారిని మధ్యవర్తిత్వానికి పంపుతాము. అంగీకార సంబంధం ఉన్నప్పుడు విచారణ జరిపి శిక్షించాల్సిన కేసులు ఇవి కావు" అని వ్యాఖ్యానించింది. ఫిర్యాదులో, నిందితుడు ఆమెను దుబాయ్‌కి ఒప్పించి, తప్పుడు పెళ్లి హామీతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని మహిళ ఆరోపించింది. సమ్మతి లేకుండా సన్నిహిత వీడియోలు తీసి, ప్రచారం చేస్తానని బెదిరించినట్లు పేర్కొంది. జనవరి 2024లో అతను పంజాబ్ లో వేరొక మహిళను పెళ్లి చేసుకున్నట్లు తర్వాత ఆమెకు తెలిసింది. ట్రయల్, ఢిల్లీ హైకోర్టులు నిందితుడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాయి. అతను అప్పటికే వివాహితుడై, జనవరి 2024లో మళ్లీ పెళ్లి చేసుకున్నందున, పెళ్లి హామీ మొదటి నుంచీ అబద్ధమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు నిందితుడు మహిళకు నష్టపరిహారం చెల్లింపుపై జస్టిస్ నాగరత్న సూచించారు. ధర్మాసనం మహిళ న్యాయవాదిని రాజీ సెటిల్‌మెంట్ అవకాశాలను పరిశీలించమని కోరింది. ఇరుపక్షాల వాదనలు వినేందుకు కేసును బుధవారానికి వాయిదా వేశారు.
0 Comments