తెలంగాణలోని సిద్దిపేట జిల్లా విఠలాపూర్ గ్రామ పొలిమేరల్లో పెద్దపులికి సంబంధించిన పాదముద్రలను అటవీ శాఖ అధికారులు శనివారం రాత్రి గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. గడిచిన కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో ఏదో క్రూర మృగం తిరుగుతోందన్న ప్రచారం సాగుతుండగా, తాజాగా పాదముద్రలు లభ్యం కావడంతో గ్రామస్థుల భయం నిజమైంది. పులి ఎటువైపు కదులుతోంది, ప్రస్తుతం ఎక్కడ ఉంది అనే విషయాన్ని కనిపెట్టడానికి అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగారు. పులి ఆచూకీ కోసం అత్యాధునిక డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించారు. పొలాలు, అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. గ్రామస్థులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే గత వారం సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలో ఐదు పశువులను చంపిన పులి అంతకు ముందు, జనగాం ప్రాంతంలో రెండు గొర్రెలను చంపినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ గత రెండు నెలలుగా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
0 Comments