హైదరాబాద్ లోని అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో అత్యాధునిక 'డాల్బీ అట్మాస్ 7.1.4 హెచ్ఈ మిక్స్' సౌకర్యాన్ని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణి ప్రారంభించారు. ప్రొఫెషనల్ సౌండ్ ఎడ్యుకేషన్, ఇమ్మర్సివ్ ఆడియో ప్రొడక్షన్‌లో ఈ సౌకర్యం ఓ మైలురాయిగా నిలవనుంది. ఈ నూతన డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, సౌండ్ డిజైనర్లకు ప్రపంచ స్థాయి ఇమ్మర్సివ్ ఆడియో మిక్స్‌లను రూపొందించే అవకాశం లభిస్తుంది. 7.1.4 హెచ్ఈ సౌండ్ స్టూడియో అందుబాటులోకి రావడం వల్ల, సినిమా నిర్మాణంలో నేటి తరం అవసరమైన స్పేషియల్ ఆడియో, సౌండ్ డిజైనింగ్‌లో విద్యార్థులు పట్టు సాధించవచ్చని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ "అన్నపూర్ణ కాలేజీలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 7.1.4 మిక్స్ సౌకర్యం అందుబాటులోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమాకు ప్రాణం పోసేది శబ్దం. సినిమా పరిశ్రమ ఎప్పుడూ సాంకేతికతపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మా విద్యార్థులకు ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని అందుబాటులో ఉంచేందుకు మేము ప్రాధాన్యత ఇస్తాం" అని అన్నారు. ఈ స్టూడియోలో ప్రదర్శించిన డెమోను సంగీత దర్శకుడు కీరవాణి వీక్షించి అభినందించారు. అనంతరం సౌండ్ డిజైనింగ్‌లో ఉండే మెళకువలపై విద్యార్థులతో ముచ్చటించారు. "సౌండ్ అనేది సినిమాకు ఆత్మ వంటిది. సరైన సౌండ్ డిజైనింగ్ సినిమాలోని భావోద్వేగాలను ఎలివేట్ చేస్తుంది. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇటువంటి ప్రపంచ స్థాయి సౌకర్యాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయి. విద్యార్థులు ఇక్కడ నేర్చుకుని, ప్రయోగాలు చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవడం ఆనందంగా ఉంది" అని కీరవాణి పేర్కొన్నారు.
0 Comments