ముంబై లోకల్ ట్రైన్‌లో సీటు కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మలాడ్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రొఫెసర్‌ను తోటి ప్రయాణికుడు దారుణంగా హత్య చేశాడు. లోకల్ ట్రైన్‌లో తొలుత గొడవపడిన ఇద్దరు, ట్రైన్ దిగేప్పుడు కూడా ఘర్షణకు దిగారు. దీంతో నిందితుడు ప్రొపెసర్‌ని కత్తితో పలు మార్లు పొడిచి హత్య చేసి పరారయ్యాడు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విలే పార్లేలోని ప్రముఖ కాలేజీలో అలోక్ సింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శనివారం ఆయన లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా, సీటు విషయంలో ఓ ప్రయాణికుడితో వాగ్వాదం జరిగింది. ట్రైన్ మలాడ్ స్టేషన్ చేరగానే దిగే సమయంలో గేటు వద్ద రద్దీ కారణంగా తోపులాట జరిగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. దీంతో ఆ వ్యక్తి కత్తితో ప్రొఫెసర్‌ని పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత జనం రద్దీలో కలిసిపోయి పరార్ అయ్యాడు. తీవ్ర గాయాలతో అలోక్ సింగ్ మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు హత్య చేసిన వ్యక్తిని ఓంకార్ షిండే (27)గా గుర్తించారు. దాడి చేసిన కొద్దిసేపటికే వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా పారిపోవడం సిసిటివి కెమెరాల్లో రికార్డైంది. దీంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
0 Comments