హైనికెన్ బ్రేవరేజెస్ సంస్థ రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల డిమాండ్ తగ్గడం, వ్యయాలు పెరగడంతో పాటు ఇటీవలే చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీనామా అనంతరం నాయకత్వ అనిశ్చితి వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తన లాభాల వృద్ధి అంచనాలను కూడా తగ్గించింది. మున్ముందు మరిన్ని లేఆఫ్స్ ఉండొచ్చని తెలిపింది. మార్కెట్ విలువరీత్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రూవర్ అయిన హైనేకెన్ ఉత్పాదకతను పెంచే ప్రయత్నంలో భాగంగా తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు ఏడు శాతం మందిని, అంటే 5,000 నుండి 6,000 పోస్టులను తొలగించనుంది. ప్రస్తుతం కంపెనీలో 87,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా లేఆఫ్ ద్వారా ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ప్రస్తుత ఉద్యోగుల పని సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. కిందటి నెలలో సీఈఓ డాల్ఫ్ వాన్ డెన్ బ్రింక్ ఆకస్మికంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. వాన్ డెన్ బ్రింక్ మే నెలలో పదవి నుంచి వైదొలగనున్నారు. ఆయన వారసుడి కోసం కంపెనీ అన్వేషణ మొదలు పెట్టింది. ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా వృద్ధి అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాధాన్యత లేని మార్కెట్‌లపై దృష్టి సారించనున్నాయి. అంతేకాకుండా, గతంలో ప్రకటించిన పునర్నిర్మాణ కార్యక్రమాల ద్వారా సప్లై నెట్‌వర్క్, ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ వ్యాపార విభాగాలలో మరిన్ని తగ్గింపులు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ చర్యలు సంస్థ కార్యకలాపాలను బలోపేతం చేయడంతో పాటు వృద్ధిలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యాన్ని కొనసాగించడానికి ఉద్దేశించినవని హైనేకెన్ ఫైనాన్షియల్ డివిజన్ చీఫ్ హెరాల్డ్ వాన్ డెన్ బ్రూక్ పేర్కొన్నారు. హైనేకెన్ 2026లో నిర్వహణ లాభాల వృద్ధి 2 నుండి 6 శాతం మధ్యన ఉంటుందని అంచనా వేస్తోంది.
0 Comments