ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఏ 2గా వున్న వాసుదేవరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆయనను తప్పించారు. లిక్కర్ కేసులో ఏం జరిగిందో ఆయన అన్నీ సిట్ అధికారులకు చెప్పారు. కొంతకాలంగా అధికారులకు సహకరిస్తూ అప్రూవర్‌గా మారేందుకు ప్రయత్నించారు. ఆయనతో పాటు సత్యప్రసాద్ అనే మరో అధికారి అప్రూవర్ పిటిషన్లు వేసినా కింది కోర్టు అంగీకరించలేదు. దాంతో హైకోర్టుకు వెళ్లారు. మరో వైపు వారిని అరెస్టు చేయాల్సిందేనని చెవిరెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంలో కొన్ని కీలక అంశాలను దాచిపెట్టారని, దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశం ఉందన్న అనుమానంతో అధికారులు అనూహ్యంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్‌లో వాసుదేవరెడ్డి పాత్ర అత్యంత కీలమని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న సమయంలో, మద్యం టెండర్ల విధానంలో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా లిక్కర్ సిండికేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ధరల నిర్ణయంలో జోక్యం చేసుకోవడం వంటి అంశాల్లో ఆయన కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు ఆధారాలు లభించాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేలా సాగిన ఈ వ్యవహారంలో పైస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. వాసుదేవరెడ్డి అరెస్ట్‌తో ఈ స్కామ్‌లో ఉన్న మరికొందరు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
0 Comments